శ్రీబాగ్ ఒడంబడిక అమలు | SRI BAGH PACT FOR IMPLEMENTATION
శ్రీబాగ్ ఒడంబడిక
శ్రీబాగ్ ఒడంబడిక అమలులో పాలకుల వైఫల్యాలకు నిరసనగా నవంబర్ 16 2021 న నిర్వహిస్తున్న రాయలసీమ సత్యాగ్రహం విజయవంతం చేయండి.
వేదిక :-
గాంధీ చౌక్, నంద్యాల మరియు రాయలసీమలోని వివిధ రెవిన్యూ కేంద్రాలలో
తేది,సమయం :-
నవంబర్ 16, 2021 ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటలవరకు నవంబర్ 16 నే రాయలసీమ సత్యగ్రహం ఎందుకు ?
రాయలసీమ హక్కుల పత్రం శ్రీబాగ్ ఒడంబడిక నవంబర్ 16, 1937 జరిగింది. కానీ హక్కుల పత్రంలోని ఏ అంశాలను కూడా పాలకులు అమలు పరచలేదు.అందుకే రాయలసీమ హక్కుల పత్రంలోని అంశాలను అమలు చేయమని శ్రీబాగ్ ఒడంబడిక జరిగిన నవంబర్ 16న గత నాలుగు సంవత్సరాలుగా రాయలసీమ ప్రజా సంఘాలు సత్యాగ్రహం నిర్వహిస్తున్నాయి.
శ్రీ బాగ్ ఒడంబడిక ఎందుకు జరిగింది ?
ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలో తెలుగు ప్రజల పట్ల వివక్షకు వ్యతిరేకంగా ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం మొదలయ్యింది. ఈ ఉద్యమంలో తొలి విజయంగా తెలుగు ప్రాంతంలో విశ్వవిద్యాలయ ఏర్పాటుకు ఉమ్మడి మద్రాస్ ప్రభుత్వం అనుమతించింది. రాయలసీమలో ఏర్పాటు కావాల్సిన ఆంధ్ర విశ్వవిద్యాలయం విశాఖపట్టణం లో ఏర్పాటు చేయడంతో రాయలసీమ ప్రజలకు కోస్తా నాయకత్వంపై నమ్మకం తగ్గింది. దీనితో రాయలసీమ ప్రజలు ప్రత్యేక తెలుగు రాష్ట్ర ఉద్యమానికి దూరమయ్యారు.
రాయలసీమ ప్రజల సహకారంలేనిదే ప్రత్యేక తెలుగు రాష్ట్ర అవతరణ జరుగదని భావించిన సర్కారు నాయకులు రాయలసీమ అభివృద్ధికి కీలకమైన అంశాలతో రాయలసీమ హక్కుల పత్రం శ్రీబాగ్ ఒడంబడికను చేపట్టారు.
శ్రీ బాగ్ ఒడంబడిక లో ఏముంది ?
➡️ కృష్ణా, తుంగభద్ర, పెన్నా జలాల వినియోగంలో రాయలసీమ, నెల్లూరు జిల్లాలకు ప్రధమ ప్రాధాన్యతనిచ్చి ప్రాజక్టుల నిర్మాణాలు చేపట్టడం.
➡️ రాజధాని, హైకోర్టులలో రాయలసీమ వారు ఏదికోరితే దానిని రాయలసీమలో ఏర్పాటు చేయడం.
➡️ సర్కార్ ప్రాంతంతో సమానంగా రాయలసీమ నెల్లూరు జిల్లాలలో శాశనసభ స్థానాలు ఏర్పాటు చేయడం.
➡️ రాయలసీమలో విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయడం.
శ్రీ బాగ్ ఒడంబడిక అమలు జరిగిందా ?
➡️ రాయలసీమకు కృష్ణా జలాలు అందకుండా చేసారు; సిద్దేశ్వరం వద్ద కృష్ణా పెన్నార్ ప్రాజక్టుకు ఆంధ్రరాష్ట్ర అవతరణకు రెండు సంవత్సరాల ముందే 1951 లోనే ప్లానింగ్ కమీషన్ అనుమతులు ఇచ్చింది. ఈ ప్రాజక్టు ద్వారా రాయలసీమ, నెల్లూరు జిల్లాలలో కృష్ణా జలాల వినియోగానికి ప్రణాళికలు చేసారు. తెలుగు రాష్ట్రం ఏర్పడిన తరువాత కృష్ణా పెన్నార్ ప్రాజక్టుకు బదులుగా నాగార్జున సాగర్ ప్రాజక్టు చేపట్టారు. ఈ చర్యతో కృష్ణా జలాలు రాయలసీమకు అందకుండ పోయాయి.
➡️ రాజధాని రాయలసీమకు అందని ద్రాక్షా పండు అయ్యింది. 1953 అక్టోబర్ 1న ఏర్పడిన ఆంధ్రరాష్ట్రానికి కర్నూలు కేంద్రంగా రాజధాని ఏర్పాటు అయ్యింది. కానీ నవంబర్ 1, 1956 లో విశాల అంధ్రప్రదేశ్ ఏర్పాటు తో రాజధాని హైదరాబాద్ కు తరలి పోయింది.
శ్రీ బాగ్ ఒడంబడిక అమలుకు మరొక్కసారి అవకాశం లభించిందా ?
అంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టం 2014 తో ఉమ్మడి అంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి విడిపోయి హైదరాబాద్ రాజధానితో కూడిన తెలంగాణా జూన్ 2, 2014 ఏర్పడింది. దీనితో ఉమ్మడి మద్రాస్ రాష్ట్రం నుండి విడిపోయిన భుభాగాలతో ఏర్పడిన నాటి ఆంధ్ర రాష్ట్రమే, నేడు అంధ్రప్రదేశ్ రాష్ట్రంగా అవతరించింది. అంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టం – 2014 శ్రీ బాగ్ ఒడంబడికను అమలు పరిచే అవకాశాన్ని మరొక్కసారి ఇచ్చింది.
అంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టం – 2014 శ్రీ బాగ్ ఒడంబడిక అమలుకు ఏయే అవకాశాలు ఇచ్చింది ?
శ్రీబాగ్ ఒడంబడిక స్పూర్తిని గౌరవిస్తూ అంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టం-2014లో అనేక అంశాలను పొందపరిచారు.
అందులో కీలకమైనవి.
కృష్ణా జలాల వినియోగం :-
ఉమ్మడి అంధ్రప్రదేశ్ లో నిర్మాణం లో ఉన్న అన్ని ప్రాజక్టుల నిర్మాణం కొనసాగించాలి అని రాష్ట్ర విభజన చట్టంలో స్పష్టంగా పేర్కొన్నారు. గాలేరు – నగరి, హంద్రీ నీవా, తెలుగు గంగ, వెలిగొండ ప్రాజక్టులను రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి చెయ్యాలి అని విభజన చట్టంలో పేర్కొన్నారు.
గోదావరి నది నుండి నీటిని కృష్ణా నదికి మళ్ళించే పోలవరం ప్రాజక్టును జాతీయ ప్రాజక్టుగా కేంద్ర ప్రభుత్వం నిర్మించాలని చట్టంలో పేర్కొన్నారు. పోలవరం, దుమ్మగూడెం నాగార్జున సాగర్ టైల్ పాండ్ ప్రాజక్టుల నిర్మాణంతో గోదావరి జలాలను, కృష్ణా నదికి మళ్ళించడంతో ఆదా అయ్యే కృష్ణా జలాలు రాయసీమ ప్రాజక్టుల వినియోగానికి రాష్ట్ర విభజన చట్టం “చట్టబద్ధ” అవకాశం కల్పించింది.
రాజధాని ఏర్పాటు :-
ప్రాంతీయ అసమానతలు తొలగిస్తూ, అన్ని ప్రాంతాల సమానాభివృద్ధికి మరియు చారిత్రక అంశాల నేపధ్యంలో “రాజధాని” ప్రాంత నిర్ణయానికి శివరామకృష్ణన్ కమిటి ఏర్పాటుకు విభజన చట్టం ఆవకాశం కల్పించింది.
వెనుకబడిన ప్రాంతాల అభివృద్దికి ప్రత్యేక ప్యాకేజి :
బౌతికంగా, సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంద్ర జిల్లాలు అంధ్రప్రదేశ్లోని ఇతర ప్రాంతాలతో సమానాభివృద్ధికి సాధించడానికి బున్దేల్కండ్, కోరాపుట్ తరహ “ప్రత్యేక ప్యాకేజి”తో ఆవకాశం కల్పించింది.
శ్రీ బాగ్ ఒడంబడిక స్పూర్తితో రాష్ట్ర విభజన చట్టంలోని పేర్కొన్న అంశాలు అమలు జరిగాయా ?
కృష్ణా జలాలపై రాయలసీమ ప్రాజక్టుల నిర్మాణం, రాజధాని ఏర్పాటు, సమనాభివృద్ధికి రాష్ట్ర విభజన చట్టం కలుగ చేసిన అంశాల అమలుపై పాలకులు తీవ్ర నిర్లక్ష్యం వహించారు. అందులో కీలకమైనవి.
ఏకపక్ష రాజధాని ఏర్పాటు నిర్ణయం :
శివరామకృష్ణన్ కమిటి నివేదికకు, రాయలసీమ ప్రజల అభిస్థానికి, చారిత్రిక శ్రీ బాగ్ ఒడంబడికకు వ్యతిరేకంగా “ఏక పక్షంగా రాజధానిని అమరావతి”లో ఏర్పాటు చేసారు.
పాలనా, అభివృద్ధి కేంద్రీకరణకు తిలోదకాలు :
కృష్ణా జలాలు చట్టబద్దంగా రాయలసీమ పొందడానికి ఉన్న అవకాశాల పట్ల నిర్లక్ష్యం :
ఆంధ్రప్రదేశ్ లో నిర్మాణంలో అన్ని ప్రాజక్టులు కొనసాగుతాయని రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్నారు. కానీ ఉమ్మడి అంధ్రప్రదేశ్ లో నిర్మాణంలో ఉన్న దుమ్మగూడెం నాగార్జున సాగర్ టైల్ పాండ్ ప్రాజక్టును రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన లేదు.
ఈ ప్రాజక్టును రాష్ట్ర విభజన చట్టంలో చేర్చాలని, ఇది రాయలసీమకు కృష్ణా జలాలు కేటాయించాడానికి కీలకం అని వెంకయ్యనాయుడు గారు పార్లమెంట్ లో రాష్ట్ర విభజన చట్టం పై చర్చ సంధర్భంగా కోరారు. దీనికి అప్పటి కేంద్ర మంత్రి వర్యులు జయరాం రమేష్ గారు కొన్ని సాంకేతిక వివరణలు అందాల్సి ఉన్నందున ఈ ప్రాజక్టును రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొనలేదు అని పేర్కొంటూ ఉమ్మడి అంధ్రప్రదేశ్ లో నిర్మాణం లో ఉన్న అన్ని ప్రాజక్టులు చేపడతామని పార్లమెంట్ సాక్షిగా ప్రకటించారు. ఇదే విషయాన్నీ స్పష్టంగా రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్నారు. రాష్ట్ర విభజన జరిగి 7 ఏళ్ళు అయిన పాలకపక్షానికి కానీ, ప్రతిపక్షానికి కాని, అంధ్రప్రదేశ్ లోని ఏ రాజకీయ పార్టీ ఈ అంశంపైన గళం విప్పలేదు. “రాయలసీమ పట్ల రాజకీయ పార్టీల నిర్లక్ష్యానికి" ఇది ఒక ఉదాహరణ.
కేంద్రం నిర్మించాల్సిన పోలవరం జాతీయ ప్రాజక్టును రాష్ట్ర ప్రభుత్వం చేపట్టడంతో రాయలసీమ ప్రాజక్టుల నిర్మాణాలకు తీవ్ర విఘాతం :
పోలవరం ప్రాజక్టును జాతీయ ప్రాజక్టుగా రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్నారు. ఈ ప్రాజక్టును కేంద్ర ప్రభుత్వం స్వయంగా నిర్మిస్తుందని ప్రకటించారు.
నిర్మాణంలో ఉన్న రాయలసీమ ప్రాజక్టులను రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేయాలని రాష్ట్ర విభజన చట్టం లో పేర్కొన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం పోలవరం ప్రాజక్టును రాష్ట్ర ప్రభుత్వ నిధులతో చేపట్టడంతో, కేంద్రప్రభుత్వంకు బిల్లులు పంపడం.
కేంద్రప్రభుత్వం పంపే డబ్బుల కోసం ఎదురు చూడడం, ఆ విధంగా ఆలస్యంగా వచ్చిన డబ్బులు మరల పోలవరం ప్రాజక్టు నిర్మాణానికి ఖర్చు చేయడం, తిరిగి ఎదురు చూడడం అనే ప్రక్రియ మొదలయ్యింది. పోలవరం ప్రాజక్టు ప్రాధాన్యతగా రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఖర్చు చేస్తుండటంతో, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో పూర్తి చేయాల్సిన రాయలసీమ ప్రాజక్టులు నిధుల లేమితో తీవ్ర నిర్లక్ష్యానికి గురి అయ్యాయి. ప్రాజక్టుల నిర్మాణం నత్త నడకన నడుస్తుంది. ఈ ప్రాజక్టులు మొదలుపెట్టి నాలుగు దశాబ్దాలైన రాష్ట్ర ప్రభుత్వ లోపభూయిష్ట ప్రాధాన్యతలతో రాయలసీమ ప్రాజక్టుల నిర్మాణాలకు అవాంతరాలు నిరంతరం కొనసాగుతూనే వున్నాయి.
వెనకబడిన రాయలసీమ అభివృద్ధికి రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న ప్రత్యేక ప్యాకేజి సాధనకు చిత్తశుద్ధి లేని రాజకీయ వ్యవస్థ :
బౌతికంగా, సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంద్ర జిల్లాలు అంధ్రప్రదేస్ లోని ఇతర ప్రాంతాలతో సమానాభివృద్ధికి సాధించడానికి బున్దేల్కండ్, కోరాపుట్ తరహ ప్రత్యేక ప్యాకేజితో కింద రాయలసీమ జిల్లాలకు 30 నుండి 35 వేల కోట్ల రూపాయల ఆర్థిక సహాయం అందాలి. ఈ ప్యాకేజి కింద అందే ఆర్థిక సహాయంతో రాయలసీమలో చెరువుల నిర్మాణం , పునరుద్దరణ, వీటిని వాగులు, వంకలు, నదులు, కాలువలతో అనుసంధానం, సామాజిక అడవుల పెంపకం, నదుల పునరుజ్జీవణతో రాయలసీమ ప్రాంత పర్యావరణ అభివృద్ధికి నిర్దిష్ట సమయ, అభివృద్ధి ప్రణాళికతో ప్రత్యేక సాగునీటి కమీషన్ ఏర్పాటు జరిగి ఉండాలి. కానీ కేంద్ర ప్రభుత్వం మూడు సంవత్సరాలు జిల్లాకు 50 కోట్ల చొప్పున 600 కోట్ల నిధులు విడుదల చేసింది. (కాంగ్రెస్ ఆధ్వర్యంలోని UPA ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉండగా దేశవ్యాప్తంగా వెనుకబడిన ప్రతి జిల్లాకు 50 కోట్లు ఆర్థిక సహకారం ఇచ్చారు.) ఇది కేవలం కంటి తుడుపు చర్య , ప్రత్యేక ప్యాకేజి కాదు. రాయలసీమ ప్రత్యేక ప్యాకేజికై చిత్తశుద్ధితో ఏ రాజకీయ పార్టీ ఈ అంశంపై గళం విప్పలేదు.
రాయలసీమ ప్రజాసంఘాల అధ్వర్యంలో రాయలసీమ సత్యాగ్రహాలు :
రాయలసీమ పట్ల పాలుకుల నిర్లక్ష్యాన్ని సమాజం ముందుంచడానికి, పాలకులపై ఒత్తిడి పెంచడానికి, రాయలసీమ అభివృద్ధి సాధించడానికి “రాయలసీమ ప్రజా సంఘాల సమన్వయ వేదిక” అధ్వర్యంలో ప్రజా సంఘాలు నవంబర్ 16న “రాయలసీమ సత్యాగ్రహం” ను 2018 నుండి నిర్వహిస్తున్నాయి.
“రాయలసీమ సాగునీటి సాధన సమితి” నిర్వహణలో రాయలసీమ ప్రజాసంఘాలు విజయవాడ కేంద్రంగా రాయలసీమ సత్యాగ్రహంను నవంబర్ 16, 2018 న పెద్దఎత్తున నిర్వహించాయి. “అనంతపురం జలసాధన సమితి” నిర్వహణలో రాయలసీమ ప్రజాసంఘాలు అనంతపురం కేంద్రంగా రాయలసీమ సత్యాగ్రహం ను నవంబర్ 16, 2019 న భారీగా నిర్వహించాయి.
గత రెండు సంవత్సరాలుగా రాయలసీమ సత్యాగ్రహం పెద్ద ఎత్తున నిర్వహించడం వలన, శ్రీబాగ్ ఒడంబడికను గౌరవించాలి, పాలనా వికేంద్రీకరణ, అభివృద్ధి వికేంద్రీకరణతో రాయలసీమ అభివృద్ధి జరపాలి అనే డిమాండ్లను బలంగా ప్రజాసంఘాలు వినిపించ గలిగాయి.
రాయలసీమ సత్యాగ్రహ స్పందనగా పాలకుల వాగ్ధానాలు :
గత దశాబ్దంగా రాయలసీమ వ్యాప్తంగా జరిగిన ఉద్యమాలు, గత రెండేళ్లుగా పెద్దఎత్తున నిర్విహించిన రాయలసీమ సత్యాగ్రహాలను అంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుర్తించింది. శ్రీబాగ్ ఒడంబడికను గౌరవించి, అందుకు అనుగుణంగా రాయలసీమ అభివృద్ధి చేపడతామని ప్రభుత్వం శాసన సభలో ప్రకటనలు కూడా చేసింది. పాలనా, శాశన, న్యాయ రాజధానులను మూడు ప్రాంతాలలో ఏర్పాటుకు శాశనసభ లో చట్టాలు చేసింది. శ్రీబాగ్ ఒడంబడిక నేపథ్యంలో న్యాయ రాజదానిని రాయలసీమలో ఏర్పాటు చేయడానికి చట్టసభలో శాసనాలు కూడా చేసింది. సాగునీటి అభివృద్ధికి కూడా అనేక ప్రకటనలు చేసింది. *“శ్రీ బాగ్ ఒడంబడిక స్పూర్తితో పాలనా, అభివృద్ధి వికేంద్రేకరణ”* చేపడతామని ప్రకటించింది.
పాలకుల వాగ్దానాల అమలుకు సంకల్పదీక్ష, రాయసీమ సత్యాగ్రహం – 2020 :
అంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన పాలన, అభివృద్ధి వికేంద్రీకరణ అమలు చెయ్యాలని డిమాండ్ చేస్తూ కడప కేంద్రంగా “రాయలసీమ సంకల్ప దీక్ష” జనవరి 17, 2020 మరియు “రాయలసీమ సత్యాగ్రహం” నవంబర్ 16, 2021 న రాయలసీమ వ్యాప్తంగా “400 కేంద్రాలకు పైన గ్రామ సచివాలయాల” వద్ద నిర్వహించడమైనది. ఈ సంధర్బంగా శ్రిబాగ్ ఒడంబడికను గౌరవిస్తూ ప్రభుత్వం ప్రకటించిన పాలనా అభివృద్ధి వికేంద్రీకరణ చిత్తశుద్దితో అమలుకు క్రింది అంశాలను ప్రాధాన్యతగా చేపట్టాలని కోరడమైనది.
➡️ రాష్ట్ర సమగ్రాభివృద్ధికి, సమాన అభివృద్ధికి కీలకమైన పాలనావ్యవస్థ వికేంద్రీకరణలో రాయలసీమకు కుడా మిగిలిన ప్రాంతాలతో సమానంగా ప్రాతినిధ్యం కల్పించడంలో భాగంగా హైకోర్ట్ తో పాటు, సెక్రటేరియట్ విభాగాలు, శాసనసభ సమావేశాలు రాయలసీమలో కూడా ఏర్పాటు చేయాలి.
➡️ శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం కృష్ణా, తుంగభద్ర జలాలలో రాయలసీమకు ప్రధమ ప్రాధాన్యతను ఇవ్వాలి. గోదావరి జలాలను నాగార్జున సాగర్, కృష్ణా డెల్టాకు మల్లించి శ్రీశైలం ప్రాజక్టును పూర్తిగా రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం, తెలంగాణాలోని మహబూబ్ నగర్ జిల్లాల అవసరాలకే వినియోగించాలి.
➡️ రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న బుందేల్ కండ్ ప్రత్యేక ప్యాకేజీని తక్షణమే అమలు చేయాలి.
➡️ రాయలసీమ సాంప్రదాయ వనరులైన చెరువుల, కుంటల అభివృద్దికి, నిర్మాణానికి "ప్రత్యేక ఇరిగేషన్ కమీషన్ ఏర్పాటు చేయాలి.
➡️ కృష్ణానది యాజమాన్య బోర్డు, AIMS, రైల్వేజోన్, వ్యవసాయ విశ్వవిద్యాలయం రాయలసీమలో ఏర్పాటు చేయాలి.
➡️ రాష్ట్ర స్థాయి కార్పొరేషన్లు, సంస్థలు, డైరెక్టరేట్ల ఏర్పాటులో రాయలసీమకు సమ ప్రాతినిధ్యం ఇవవ్వాలి.
➡️ స్టాట్యూటరి రాయలసీమ అభివృద్ధి మండలి ఏర్పాటు చేయాలి.
➡️ కోస్తా జిల్లాలతో సమానంగా రాయలసీమ నెల్లూరు జిల్లాలలో శాసన సభ స్థానాలు ఏర్పాటు చేయాలి.
పాలకపక్ష వాగ్దానాల అమలులో విపలం :
శ్రీబాగ్ ఒడంబడిక ను గౌరవిస్తున్నట్లు ప్రకటించినా ఆ దిశగా కార్యాచరణ చేపట్టడంలో అంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తిగా విపులమయ్యింది. కార్యాచరణ చేపట్టకపోగా శ్రీబాగ్ స్పూర్తికి, రాష్ట్రవిభజన చట్టానికి, రాయలసీమ అభివృద్ధికి విరుద్దంగా పాలకులు చేసిన కార్యక్రమాలకు ఉదాహరణలలో కొన్నింటిని దిగువన పేర్కొనడమైనది.
1. శ్రీబాగ్ ఒడంబడిక స్పూర్తితో ఉమ్మడి మద్రాస్ రాష్ట్రం నుండి ఏర్పడిన ఆంధ్ర రాష్ట్ర భూబాగాలతోనే కొనసాగుతున్న నేటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవతరణ దినం అక్టోబర్ 1. కానీ, అంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణతో జత కలిసి ఏర్పడిన ఉమ్మడి అంధ్రప్రదేశ్ అవతరణ జరిగిన నవంబర్ 1 న రాష్ట్ర అవతరణ దినంగా జరపడం శ్రీబాగ్ ఒడంబడికను మరుగున పరచడమే అవుతుంది.
2. కృష్ణా నది నీటి నిర్వహణకు అంత్యంత కీలకమైన కర్నూలు లో కృష్ణా నది యాజమాన్య బోర్డ్ ను ఏర్పాటు చెయ్యకుండా విశాఖపట్నం లో ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వానికి ప్రతి పాధనలు పంపడం.
3. గుండ్రేవుల రిజర్వాయర్ సమగ్ర ప్రాజక్టు నివేదిక తయారైన, నివేధిక పూర్తి చేయలేదని కేంద్ర ప్రభుత్వానికి అంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలపడం.
4. దేశానికే ప్రతిష్టాత్మకమైన, రాయలసీమ రైతుల ఆర్థిక ఉన్నతికి దోహద పడుతున్న 115 సంవత్సరాల చరిత్ర ఉన్న నంద్యాల ప్రాంతీయ వ్యవసాయస్థానం ను నిర్వీర్యం చేసే కార్యాచరణ చేపట్టడం. ప్రభుత్వం వ్యవసాయ పరిశోధన నిర్వీర్యం చేసి బక్కచిక్కిన రాయలసీమ రైతాంగాన్ని బహుళ జాతి విత్తన పరిశ్రమలకు దాసోహం చేసే కార్యాచరణకు తెరలేపడం.
5. రాష్ట్రవిభజన చట్టంలో పేర్కొన్న జాతీయ స్థాయి వ్యవసాయ విశ్వవిద్యాలయను రాయలసీమలో ఏర్పాటుకు కృషి చెయ్యకపోవడం.
6. వెలుగోడు బాలన్సింగ్ రిజర్వాయర్ నుండి బ్రహ్మసాగర్ కు నీటిని తీసుకొని పోయే మద్రాస్ కాలువను బలోపేతం చెయ్యకుండా, కడప జిల్లాలో తెలుగు గంగ రైతులకు నీరు అందకుండా చెయ్యడం. ఈ రైతాంగాన్ని మభ్య పరచడానికి అంత్యంత నిర్వహణ ఖర్చులతో కూడిన ఎత్తిపోతల పథకాన్ని, కాంట్రాక్టర్ల కోసం చేపట్టడం.
7. నెల్లూరు జిల్లాలోని సోమశిలకు బ్రహ్మ సాగర్ నుండి నీటిని తరలించాల్సి ఉండగా, ఆ కాలువను బలోపేతం చెయ్యడం మానివేసి కుందు నది వెడెల్పు చేపట్టి రాయలసీమ రైతులకు అన్యాయం చెయ్యడం. కుందు వెడెల్పు ద్వారా నదికి అటు, ఇటు వేలాది ఎకరాల భూమిని రైతులు కోల్పోతారు. నదిని వెడెల్పుచేసి, చదును చెయ్యడం ద్వారా కుందూ నది కి ఇరువైపులా సాగు అవుతున్న లక్ష యాబై వేల ఎకరాల పైన ఆధారపడిన రైతుల, రైతు కూలీల పరిస్థితి అఘమ్యగోచరంగా మార్చడం.
8. కర్నూలు పక్షిమ ప్రాంతంలో వలసల నివారణకు అమృత సాగర్ రిజర్వాయర్ నిర్మాణం చేపట్టకపోవడంతో పాటు, 8 టి ఎం సి ల సామర్థ్యంతో కాకుండా కేవలం 2 టి ఎం సి ల సామర్థ్యంతో వేదవతి ఎత్తిపోతల పథకం చేపట్టడం కేవలం కంటి తుడుపు చర్యనే.
9. తుంగభద్ర ఎగువ సమాంతర కాలువ, హంద్రీ నీవా కాలువ విస్తరణ, గాలేరు నగరి రెండవ దశ నిర్మాణాలపై పాలకుల అలక్ష్యం.
10. కల్వకుర్తి నుండి కర్నూలు జిల్లాల ఆత్మకూరు వరుకు నిర్మించే జాతీయ రహదారిలో భాగంగా సిద్దేశ్వరం వద్ద బ్రిడ్జి తో పాటు అలుగు నిర్మాణానికి కేంద్రప్రభుత్వం సానుకూలత వ్యక్త పరుస్తున్నా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాధనలు పంపకపోవడం.
11. రాష్ట్ర స్థాయి కార్పోరేషన్ లు, కార్యాలయాలు రాయలసీమలో ఏర్పాటు చేయకపోవడం.
రాష్ట్ర విభజన చట్టం – 20 14 కు వ్యతిరేకంగా కృష్ణానది యాజమాన్య బోర్డ్ నోటిఫికేషన్ లో పేర్కొన్న రాయలసీమ సాగునీటి అంశాల సవరణకు కార్యాచరణలో అంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్లక్ష్యం :
కృష్ణా నది యాజమాన్య బోర్డ్ నోటిఫికేషన్ ను జూలై 16, 2021 న కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ నోటిఫికేషన్ అక్టోబర్ 14, 2021 నుండి అమలు చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్ర విభజన చట్టంలో స్పష్టమైన హామీ ఇచ్చిన తెలుగు గంగ, గాలేరు నగరి, హంద్రీనీవా, వెలిగొండ, గురురాఘవేంద్ర, ముచ్చుమర్రి, సిద్దాపురం ఎత్తిపోతల ప్రాజక్టులకు 6 నెలల కాలంలో అనుమతులు పొందాలని పేర్కొంది. 6 నెలల కాలంలో అనుమతులు పొందక పోతే ఈ ప్రాజక్టుల నిర్మాణం పూర్తి అయినా, ఈ ప్రాజక్టుల నిర్వహణను అనుమతించమని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. నోటిఫికేషన్లో కొన్ని ఇతర సవరణలకై రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 31 న కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపింది. కానీ రాయలసీమ భవిష్యత్తుకు కీలకమైన పైన పేర్కొన్న ప్రాజక్టులను అంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టం ప్రకారం అనుమతించిన ప్రాజక్టులుగా కృష్ణానది యాజమాన్య బోర్డ్ లో సవరణలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని కోరలేదు.
పైన పేర్కొన్న ప్రాజక్టులను అనుమతించిన ప్రాజక్టులుగా కృష్ణా నది యాజమాన్య బోర్డ్ నోటిఫికేషన్ లో సవరణలు చేయాలని *“రాయలసీమ ప్రజా సత్యగ్రహన్ని”* అక్టోబర్ 4 న నంద్యాల కేంద్రంగా *“రాయలసీమ సాగునీటి సాధన సమితి"* నిర్వహించింది. ఈ ప్రజా సత్యాగ్రహం తరువాతనే ఈ ప్రాజక్టులను రాష్ట్ర విభజన చట్టం – 2014 అనుమతించిందని, ఆ మేరకు KRMB నోటిఫికేషన్లో సవరణలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర జలవనురాల శాఖకు ఉత్తరం వ్రాసింది. రాయలసీమ భవిష్యత్తుకు సంభందించిన ఈ అంశంపై KRMB లో సానుకూల నిర్ణయానికి ముఖ్యమంత్రి స్థాయి రాజకీయ దౌత్యం అవసరం ఉన్న పాలకులలో చలనం లేదు.
మన కర్తవ్యం :
రాయలసీమకు ఇచ్చిన హామీలు, పాలకుల ప్రకటనలు కార్యరూపం దాల్చడంలో వైపల్యాల చారత్రిక నేపధ్యంలో, ఇవి అన్ని కార్యరూపం దాల్చి పూర్తి అయ్యేంత వరకు, మన చట్టబద్ధ హక్కులున్న నీటిని సక్రమంగా పొందేందుకు నిర్మాణాలు చేపట్టేంత వరకు అలుపెరగని పోరాటం చేయాల్సిన అవసరాన్ని ప్రజాసంఘాల వేదిక గుర్తించింది.
రాయలసీమ అభివృద్ధికి అన్ని రాజకీయ పార్టీల మద్దతు కూడగట్టాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో రాయలసీమ అభివృద్ధి అంశాల పట్ల స్పందించని రాజకీయ పార్టీల వైఖరిని ఎండగట్టాల్సిన అవసరం కూడా అంతే ఉందన్న విషయాన్ని కూడా ప్రజాసంఘాల వేదిక గుర్తించింది. ఈ దిశగా రాయలసీమ ప్రజా సంఘాలు రాయలసీమలోని వివిధ కీలక రెవిన్యూ కేంద్రాలలో నవంబర్ 16, 2021 న నిర్వహిస్తున రాయలసీమ సత్యాగ్రహంలో రాయలసీమ ప్రజలు, అభిమానులు, ప్రజాస్వామిక వాదులు పాల్గొని విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి.
______________________________________________
Comments
Post a Comment