చీకటి భారత్ | Dark India | Public Talk News
చీకటి భారతం !
( DARK INDIA.!)
మోడీ ప్రభుత్వ ముదనష్టపు విధానాల ఫలితంగా దేశంలో చిమ్మచీకట్లు అలముకుంటున్నాయి. బొగ్గు సరఫరాలో కొరత వల్ల ఆంధ్రప్రదేశ్‌తో బాటు ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్, పంజాబ్, బీహార్, జార్ఖండ్, తమిళనాడు, వంటి రాష్ట్రాలు అంధకారం అంచుల్లో ఉన్నాయి. కరెంటు కోతలు అనివార్యమన్న సంకేతాలు అవి ఇప్పటికే ఇచ్చాయి. బొగ్గు కొరత వల్ల మన రాష్ట్రంలో జెన్‌కో ప్లాంట్లు పూర్తి స్థాయిలో నడపలేని స్థితి నెలకొంది. రాష్ట్ర అవసరాలకు అవసరమైన విద్యుత్‌లో45 శాతం వరకు ఈ థర్మల్ ప్లాంట్ల నుంచే ఉత్పత్తి అవుతున్నది. బొగ్గు సరఫరా లేక ఇవి ఆగిపోతే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు అంధకారమవుతుంది. మిగతా రాష్ట్రాల్లో పరిస్థితి ఇంచుమించు ఇదే విధంగా ఉంది. బొగ్గు కొరత వల్ల యు.పి లో 14 బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్లలో ఉత్పత్తి కార్యకలాపాలు నిలిచిపోయాయి. అయిదు థర్మల్ విద్యుత్ కేంద్రాలను పూర్తిగా మూసేశారు. రాజస్థాన్‌లో రోజుకు గంట చొప్పున కరెంటు కోత పెట్టారు. లోడ్ షెడ్డింగ్ పేరుతో పంజాబ్, తమిళనాడు వంటి రాష్ట్రాలు కోతలకు సిద్ధమవుతున్నాయి.
ముసురుకొస్తున్న ఈ సంక్షోభం ఇంకొన్నాళ్ల పాటు కొనసాగే అవకాశముంది. బొగ్గు నిక్షేపాల్లో ప్రపంచంలోనే నాల్గవ అతి పెద్ద దేశంగా ఉన్న భారత్‌కు ఈ దుస్థితి పట్టడానికి మోడీ ప్రభుత్వమే ముమ్మాటికీ కారణం. కోవిడ్ సమయంలో జనం ఎక్కువగా ఇళ్లకు పరిమితం కావడం వల్ల విద్యుత్ వాడకం పెరిగిపోయిందని, సెప్టెంబరులో వర్షాల వల్ల బొగ్గు మైనింగ్ తగ్గిందని, అంతర్జాతీయంగా బొగ్గు ధరలు పెరగడం, బొగ్గు దిగుమతులు పడిపోవడమే ఇందుకు కారణమని అధికారులు చెబుతున్నారు.
ఒడుదుడుకులు ఎప్పుడూ ఉంటాయి. వాటిని అధిగమించేందుకు ముందస్తు ప్రణాళికలు రూపొందించుకోవాలి. ఆ పని చేయడానికి మోడీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే తిరస్కరించింది. ప్రజా ప్రయోజనాల కన్నా కార్పొరేట్ల ప్రయోజనాలే తనకు ముఖ్యమని అది చెప్పదలచుకుంది. విద్యుత్ డిమాండ్, సప్లై మధ్య అంతరాన్ని విపరీతంగా పెంచి, బహిరంగ మార్కెట్‌లో యూనిట్ రేటు రూ.5 నుంచి రూ.20కి పెరగడానికి ఇదే కారణం.
ఇప్పటికే పెట్రో బాదుడుతో బెంబేలెత్తుతున్న సామాన్యుడిపై కరెంటు ఛార్జీల రూపంలో అదనపు భారాన్ని మోపేందుకు సిద్ధమైంది. దీని ప్రభావం కేవలం విద్యుత్ వినియోగదారులకు మాత్రమే పరిమితమనుకుంటే పొరపాటు. ఆర్థిక వ్యవస్థ నవనాడుల్ని ఇది పీల్చి పిప్పి చేస్తుంది. కోవిడ్ మహమ్మారి దెబ్బకు చితికిపోయిన చిన్న మధ్యతరహా పరిశ్రమలకు ఇది ఒక రకంగా మరణశాసనమే. విద్యుత్ కోతలు, ఛార్జీల పెంపుతో చిన్న పరిశ్రమలు నడవడం అసాధ్యం. బొగ్గు సరఫరా ఆగిపోతే సిమెంటు, స్టీల్ ఉత్పత్తి పైనా ప్రభావం పడుతుంది.
ఇప్పటికే బేజారెత్తిస్తున్న సిమెంట్, స్టీల్ ధరలకు ఇది మరింత ఆజ్యం పోస్తుంది. ఇది నిర్మాణ రంగాన్ని మరింత కుంగదీస్తుంది. తద్వారా నిరుద్యోగం విశ్వరూపం దాల్చుతుంది. ముంచుకొస్తున్న ఈ సంక్షోభాన్ని నివారించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో సహా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్రానికి లేఖలు రాశారు. సాధారణంగా 15-30 రోజుల వరకు సరిపడా నిల్వలు ఉండాల్సిన థర్మల్ విద్యుత్ ప్లాంట్లలో రెండు మూడు రోజులకు మించి నిల్వలు లేవు.
అయినా బొగ్గు కొరత ఏమీ లేదని, అవన్నీ అనవసర భయాలని విద్యుత్ శాఖ మంత్రి రాజ్ కుమార్ సింగ్ పేర్కొనడం అత్యంత బాధ్యతారాహిత్యం. విద్యుత్ మంత్రి ఆ ప్రకటన చేసిన మరుసటి రోజే కేంద్ర హోం మంత్రి అమిత్‌షా కేబినెట్ మంత్రులతో సమీక్ష చేపట్టారు. ఆ తరువాత ప్రధాని దీనిపై ఉన్నత స్థాయి సమీక్ష చేపట్టారు. చివరికి రాష్రాలపైకి నెపం నెట్టే ప్రయత్నం చేశారు. దేశంలో అతిపెద్ద థర్మల్ విద్యుత్ ఉత్పత్తి సంస్థ, ప్రభుత్వ రంగంలోని ఎన్‌టిపిసి ఉత్పత్తి స్థాయిని సగానికి తగ్గించుకోవాలని కేంద్రం ఆదేశించడంలో ఔచిత్యమేమిటి? విద్యుత్ డిమాండ్
ఒక వైపు పెరుగుతుంటే ఇంకోవైపు ఉత్పత్తిని తగ్గించడం వల్ల బహిరంగ మార్కెట్‌లో విద్యుత్ రేట్లు అనేక రెట్లు పెరిగిపోయాయి. ఇంత భారీ రేటుకు విద్యుత్ కొనుగోలు చేయలేమని రాష్ట్రాలు చేతులెత్తేస్తుంటే మోడీ ప్రభుత్వం చోద్యం చూస్తున్నది. మరోవైౖపు బొగ్గు సరఫరాకు విదేశీ బిడ్లను ఆహ్వానిస్తోంది. దేశంలోని అపారమైన బొగ్గు నిల్వలను విదేశీ కంపెనీలకు కట్టబెట్టేందుకు, విద్యుత్ ఛార్జీల మోత మోగించేందుకే మోడీ ప్రభుత్వం బొగ్గు కొరతను సృష్టించిందని భావించాల్సి వస్తోంది. దేశాన్ని అంధకారంలోకి నెట్టే మోడీ ప్రభుత్వ విధానాలను తిప్పికొట్టేందుకు కార్మికులు, కర్షకులతోబాటు సమస్త ప్రజానీకం పిడికిలి బిగించాలి.
Comments
Post a Comment